అద్దంకిలో ఈ దారుణ హత్య చేసిందెవరు..?

ప్రకాశం/ అద్దంకి : అద్దంకి సమీపంలో వేమవరం వాసులకు గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రత్యర్థి వర్గం పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆకోణంలో విచారణ ప్రారంభించారు. బల్లికురవ మండలం వేమవరంలో కొద్ది నెలల క్రితం టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరాం వర్గానికి చెందిన ఇద్దరిని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గానికి చెందిన వారు హత్య చేశారు. ఈ జంట హత్యలకు సంబంధించి 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు.
 
కండిషన్‌ బెయిల్‌తో బయటకు వచ్చిన వారు పోలీసుల అనుమతితో గుంటూరులో ఉంటూ అక్కడ స్టేషన్‌కు ప్రతి రోజూ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వాయిదా ఉండటంతో అద్దంకి కోర్టుకు హాజరయ్యేందుకు వారంతా గుంటూరు నుంచి కారులో బయల్దేరారు. వారి వాహనం జార్లపాలెం సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా టిప్పర్‌ రాంగ్‌ రూట్‌లో వచ్చి ఢీకొట్టిం ది. దీంతో 9 మంది నిందితులు, డ్రైవర్‌ గాయపడ్డారు. అయితే వేమవరంలో గతంలో ఫ్యాక్షన్‌ గ్రామం కావడం, కొద్ది నెలల క్రితం జంట హత్యలు జరిగి ఉండటంతో ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్త మయ్యాయి. 
 
 
ప్రత్యర్థివర్గం వారిదే టిప్పర్‌
ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను 11 రోజుల క్రితమే వేమవరం ఎస్సీ కాలనీకి చెందిన చెందిన కోటేశ్వరరావు, ఎల్లారావు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజే వారిద్దరితోపాటు, మరో ఇద్దరు కూడా పరారవడం అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించి ఫోన్‌లు కూడా స్విచ్ఛాఫ్‌ చేసి ఉన్నాయి. దీంతో తొలుత సాధారణ ప్రమాదంగా భావించిన పోలీసులు, ఇప్పుడు లోతైన విచారణ చేపట్టారు.
 
 
రంగంలోకి మూడు బృందాలు
అద్దంకి సీఐ హైమారావు, బల్లికురవ, మేదరమెట్ల ఎస్‌ఐలు అనూక్‌, పాండు రంగారావుల ఆధ్వర్యంలో మూడు బృందాలు ఈ కేసు విచారణ కోసం రంగంలోకి దిగాయి. వేమవరంలో భద్రత మరింత పెంచారు. ఇప్పటికే కొనసాగుతున్న పోలీస్‌ పికెట్‌కు అదనపు సిబ్బందిని కేటాయించారు. గ్రామస్థుల రాకపోకలపై నిఘా ఉంచారు.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial