చెమ్మగిల్లిన ముఖ్యమంత్రి కళ్ళు

               అమరావతి:  ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్లు చెమ్మగిల్లాయి. గొంతు వణికింది.స్వరంతోనే ప్రసంగం కొనసాగించారు. అంతలోనే తేరుకుని… ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరని కేంద్రాన్ని నిలదీశారు. 

తెలుగువారు గర్వపడేలా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ఆయన చాటి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం హామీల అమలుపై శాసనసభలో మాట్లాడినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. కేంద్రం నుంచి ఏ అంశానికి ఎంత సహకారం అందిందో, ఇంకా రావలసిందేంటో వివరిస్తూ… రాజధాని అమరావతి  నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి ముఖ్యమంత్రి చలించిపోయారు. రాజధానికి కేంద్రం చెప్పిన సాయం చేయకపోగా, అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మించుకోవాలన్న తమ సంకల్పాన్ని ఎగతాళి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రాజధానికి రైతులు రూ.40 వేల కోట్ల విలువైన భూముల్ని స్వచ్ఛందంగా ఇచ్చారు. బాధ్యతగల ప్రభుత్వాలుగా మనమేం ఇచ్చాం? అదే నేను అడుగుతున్నాను. అక్కడే నాకు బాధేస్తోంది. రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. దానిలో గుంటూరు, విజయవాడ నగరాలకు చెరో రూ.500 కోట్లు ఇచ్చారు. రాజధానికి కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి అంతా ఇచ్చేశామన్నట్టు మాట్లాడుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్ర ప్రజలకు విశ్వాసం అందించడానికి వచ్చానని, విభజన చట్టం స్ఫూర్తిని చెదరనీయకుండా, దానిలోని అంశాలన్నీ అమలు చేస్తామని, భారత ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని ప్రధాని చెప్పారు. చంద్రబాబు-నరేంద్ర మోదీ జోడీ నిర్ణీత సమయంలోగా వాటన్నిటినీ ఆచరణలోకి తెస్తుందని, తనను విశ్వసించమని తెలిపారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో అది చేయమనే అడుగుతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

‘‘రాజధాని లేకపోవడం ఒక సంక్షోభం. దాన్ని అవకాశంగా మార్చుకుని దేశంలోనే సుందర నగరం నిర్మించుకునే అవకాశం మనకు లభించింది. కేంద్రం పూర్తి సహకారం అందిస్తే దేశానికే ప్రతిష్ఠ పెరుగుతుంది కదా? కేంద్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పన్నులు కట్టడం లేదా?’’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. ‘‘కలల నగరం కడతారంట, ఏదో పెద్ద నగరం కడతారంట… కట్టమనండి అని మీలోనూ కొందరు మాట్లాడారు’’ అని పరోక్షంగా భాజపా సభ్యులనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు మనం ఉన్న శాసనసభ, తాత్కాలిక సచివాలయం భవనాలు బాలేదా? బాగానే ఉన్నాయి? కానీ మేం కట్టాలనుకున్న రాజధాని ఇది కాదు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు కంటే అది మిన్నగా ఉండాలి. అలాంటి నగరాన్ని నిర్మిస్తాం. ప్రపంచం మొత్తం తెలుగువాడి సత్తా ఏంటో చాటిచెబుతాం’’అని ముఖ్యమంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను అభినందిస్తూ శాసనసభలోను, మండలిలోను గురువారం తీర్మానం ప్రవేశపెట్టాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial