బంగ్లాదేశ్‌లో హిందూ గ్రామానికి నిప్పు

రంగ్‌పూర్: ఫోస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్ చేసిందుకు ఆగ్రహించిన ఓ వర్గానికి చెందిన జనం ఓ హిందూ గ్రామంపై విరుచుకుపడ్డారు. నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. లూటీ చేశారు. దీంతో సుమారు 30 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆగ్రహించిన అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయి గోళాలు ప్రయోగించడంతో ఒక వ్యక్తి మరణించగా, సుమారు ఐదుగురు గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ సదర్ ఉపాజిలాలోని థాకూర్‌బరి గ్రామంలో ఈ ఘటన గత శుక్రవారంనాడు చోటుచేసుకుంది.
 
 
తకుబరి గ్రామానికి చెందిన టిటూరాయ్ అనే వ్యక్తి ప్రస్తుతం నారాయణ్ గంజ్‌లో ఉంటున్నాడు. ఇటీవల అతను మమహ్మద్ ప్రవక్తను కించపరచేలా ఫేస్‌బుక్ పోస్ట్ చేయడం ఈ విధ్వంసానికి దారితీసినట్టు చెబుతున్నారు. జుమా ప్రార్థనల అనంతరం వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 వేల మంది ఒక చోట గుమిగూడి హిందూ గ్రామంపై విరుచుకుపడ్డారు. ఇళ్లను లూటీ చేస్తూ నిప్పుపెట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ గుంపును చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించారు. ఆరుగురికి బుల్లెట్ గాయాలు తగలడంతో వారిని హుటాహుటిన రంగ్‌పూర్ మెడికల్ ఆసుపత్రిలో చేర్చారు. ఒకరు చికిత్స పొందుతూనే మరణించడంతో ఆగ్రహించిన గుంపు పోలీసుదాడికి నిరసనగా రంగ్‌పూర్-దినాజ్‌పూర్ హైవేపై రాస్తారోకోకు దిగారు. సుమారు నాలుగు గంటల సేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరి పరిస్థితిని అదుపులో పెట్టాయి. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేశామని, వారంలో నివేదిక వస్తుందని రంగ్‌పూర్ డిప్యూటీ కమిషన్ వాహిదుజ్జమన్ తెలిపారు. హిందూ గ్రామంలోని బాధిత కుటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial